Skip to content Skip to footer

Justice for Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు గురువారం వెలువరించిన సుదీర్ఘమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా రాజధాని నగరాన్నీ, ప్రాంతాన్నీ అభివృద్ధిచేయాలన్న హైకోర్టు ఆదేశం ఈ విషయంలో మూడుముక్కలాటాడుతున్నవారికి శరాఘాతం. ఆరునెలల్లో మాస్టర్ ప్లాన్ అమలు పూర్తిచేయాలనీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, కనీసావసరాలు తీర్చడం నెలరోజుల్లో జరగాలని న్యాయస్థానం ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరచిన ప్లాట్లు మూడునెలల్లో అప్పగించాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు ఇస్తుండాలని నిర్దేశించడం ద్వారా త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని అన్నిపక్కల నుంచీ కట్టడి చేసింది.

దాదాపు 800 రోజులకు పైగా విభిన్న రూపాల్లో ఉద్యమాలు చేస్తున్న అమరావతి రైతులకు ఇది అద్భుత విజయం, చక్కని ఉపశమనం. రైతులకు ఇచ్చిన మాటకు, చేసుకున్న ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడని కారణంగా వారికి ఆర్థికంగా, మానసికంగా ఒనగూరిన నష్టాన్ని న్యాయస్థానం సముచితరీతిలో గుర్తించడం విశేషం. రాజ్యాంగంలోని 226 అధికరణకు లోబడి రైతుల హక్కులను పరిరక్షించవలసిన, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిన బాధ్యత తనమీద ఉన్నదని ప్రకటించి అమరావతి సత్వర అభివృద్ధిని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, పిటిషనర్లకు కొంతమొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలనడం వారి ఆకాంక్షలను గౌరవించడమే. కమిటీలు, కన్సల్టెన్సీల నివేదికలంటూ పాలకులు చేస్తున్న మాయను నిరోధించడానికి వీలుగా న్యాయమూర్తులు పిటిషనర్లకు ఇచ్చిన స్వేచ్ఛ సముచితమైనది. సీఆర్డీఏ చట్టం, భూసేకరణ పథకం పరిధిలోనే సమస్త వ్యవహారాలు సాగాలి తప్ప, దీనిలో పేర్కొన్నదానికి భిన్నంగా రాజధానిని మార్చడానికి కానీ, ముక్కలు చేయడానికి కానీ, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల అత్యున్నత పీఠాలను కదల్చడానికి కానీ కొత్తచట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం నిర్థారించడం విశేషం. భూ సమీకరణ పథకం ద్వారా రైతులనుంచి తీసుకున్న భూమిని రాజధాని నగర నిర్మాణానికి తప్ప తనఖాలు పెట్టి అప్పుతెచ్చుకోవడానికి వాడవద్దన్న వ్యాఖ్య ప్రభుత్వానికి చెంపపెట్టు. కోర్టులో కేసు నడుస్తుండగానే కార్యాలయాల తరలింపునకు విశ్వప్రయత్నాలు చేసిన పాలకులకు న్యాయస్థానం మరోమారు సంకెళ్ళు గట్టిగా బిగించింది.
తాను ఆడుతున్న మూడుముక్కలాటకు న్యాయస్థానాల్లో ముప్పు ఎదురుకాక తప్పదని గ్రహించే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తాను గతంలో తెచ్చిన రద్దుచట్టాలను రద్దుచేసుకుంటూ ఇటీవల కొత్త చట్టాన్ని తెచ్చింది. మూడురాజధానుల మాటకు అంతేగట్టిగా కట్టుబడివున్నామని ఒకపక్క మంత్రులు బల్లగుద్ది మరీ చెబుతుంటే, ప్రభుత్వం తన వికేంద్రీకరణ నిర్ణయాలన్నీ ఉపసంహరించుకొని కాలూచేయీ వెనక్కుతీసుకున్నాక కూడా వ్యాజ్యాల మీద విచారణ ఎందుకని ప్రభుత్వ న్యాయవాదులు మరోపక్క వాదించారు. కానీ, తమ వ్యాజ్యాల్లో విచారణార్హత కలిగివున్న అభ్యర్థనలు అనేకం ఉన్నాయని న్యాయస్థానాన్ని ఒప్పించి, విచారణ కొనసాగేట్టు చేయడం వల్ల ఇప్పుడు రైతులకు న్యాయం చేకూరడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని విషయంలో వీరంగాలు వేసే, విన్యాసాలు చేసే అధికారం లేదని తేలిపోయింది. మాస్టర్ ప్లాన్‌కూ, క్యాపిటల్ ఏరియా నిర్వచనానికీ తూచ తప్పకుండా కట్టుబడటం అంటే, న్యాయస్థానం నుంచి నవనగరాల నిర్మాణం వరకూ అన్నీ గతంలో అనుకున్న ప్రకారం జరగడమే.
అమరావతి రాజధాని విషయంలో అధికారపక్షం ఇప్పటివరకూ చేసిన అడ్డగోలు వాదనలకు ఇక స్వస్తిచెప్పడం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఉత్తమం. విపక్షనేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సమర్థించి, అధికారంలోకి వచ్చిన తరువాత మాటామడమా తిప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని అప్రదిష్టపాల్జేయడానికి నైతికంగా ఎంతో దిగజారింది. భ్రమరావతి అనీ, గ్రాఫిక్స్ అనీ తీసిపారేసిన అధికారపక్ష నేతలు గత ప్రభుత్వం అక్కడ చేసిన ఖర్చుకు సంబంధించి న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను గమనించాలి. గత రెండున్నరేళ్ళుగా అమరావతిని అంగుళం కూడా ముందుకు కదలనివ్వని జగన్ ప్రభుత్వం ఇకనైనా కార్యాచరణలోకి దిగితే, ఎనిమిదేళ్ళుగా రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు తాను చేజేతులా చేసిన నష్టాన్ని కాస్తంతైనా భర్తీచేయవచ్చు.

Leave a comment