రాజద్రోహ సెక్షన్ అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఉత్తర్వులు వెలువరించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 124ఏ సెక్షన్ కింద తాజా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని కేంద్రప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. అలాగే ఇప్పటికే పెట్టిన కేసుల విచారణను, తదుపరి చర్యలను నిలిపివేయాలని నిర్దేశించింది. 152 ఏళ్లనాటి.. అత్యంత కఠినమైన ఈ వలసవాద చట్టాన్ని ప్రభుత్వం పునఃపరిశీలన చేసేదాకా నిలుపుదల చేయాలని.. అప్పటి వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను జూలై మూడోవారానికి వాయిదావేసింది. తమ ఉత్తర్వుల ఆధారంగా సదరు సెక్షన్ కింద కేసులు నమోదైన బాధితులు, జైళ్లలో ఉన్నవారు బెయిల్, ఇతరత్రా ఉపశమనాల కోసం సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చని సూచించింది. నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) క్రోడీకరించిన డేటా ప్రకారం.. 2015-20 నడుమ 124ఏ కింద 356 కేసులు నమోదు కాగా.. 548 మంది అరెస్టయ్యారు. వీటిలో ఏడు కేసులకు సంబంధించి అరెస్టయిన 12 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు రాజద్రోహం సెక్షన్ 124ఏని దుర్వినియోగం చేస్తున్నాయంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్జీ వొంబట్కెరె, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, జర్నలిస్టులు అనిల్ చమాడియా, ప్యాట్రీషియా ముఖిమ్, అనూరాధా భాసిన్, అసోం జర్నలిస్టు యూనియన్ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిరుడు జూలైలో నోటీసులు జారీచేస్తూ.. ఈ సెక్షన్‌పై చీఫ్ జస్టిస్ రమణ కటువైన వ్యాఖ్యలు చేశారు.గాంధీజీ, తిలక్ తదితరులను అణచివేయడానికి బ్రిటి్‌షవారు ఉపయోగించిన ఈ వలసవాద చట్టాన్ని.. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడచినా ఇంకా కొనసాగించాలా అని ప్రశ్నించారు. ‘ఈ సెక్షన్ చరిత్ర చూస్తే దీనికి అంతులేని అధికారం ఉంది. ఏదైనా వస్తువు చేయడానికి ఓ వడ్రంగికి రంపం ఇస్తే.. దానితో చెట్టుకు బదులు మొత్తం అడవినే నరికేసిన చందంగా ఈ సెక్షన్ ఉంది’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం తరఫున సమాధానమిస్తూ.. 1962లో కేదార్‌నాథ్‌సింగ్ కేసులో రాజద్రోహ చట్టాన్ని సమర్థిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సెక్షన్‌ను దుర్వినియోగం చేసిన ఏవో కొన్ని దృష్టాంతాల ఆధారంగా.. ఇన్నేళ్లుగా కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన ఈ నిబంధనపై స్టే విధించడం తగదని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రధాని మోదీ జోక్యంచేసుకుని ఈ వలసవాద చట్టాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించినట్లు మెహతా గత సోమవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే అప్పటిదాకా పాత రాజద్రోహం కేసులపై స్టే ఇవ్వాలని.. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. పెండింగ్ కేసులను నిలిపివేయడం, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదుచేయకపోవడంపై బుధవారంలోగా వైఖరిని తెలియజేయాలని చీఫ్ జస్టిస్ మంగళవారం కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.స్టే విధించొద్దు: సొలిసిటర్ జనరల్ ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ మెహతా కేంద్రం వైఖరిని బుధవారం వివరించారు. రాజద్రోహ చట్టం అమలుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల వినతిని వ్యతిరేకించారు. రాజ్యాంగ ధర్మాసనం సమర్థించిన నిబంధనలపై స్టే విధించడం సరైన విధానం కాదన్నారు. విచారణకు అర్హమైన నేరాన్ని రిజిస్టర్ చేయకుండా అడ్డుకోరాదని కోరారు. ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలకు సంబంధించి ఒక చట్టం ఉండాలని ప్రతి ఒక్కరూ దేశ ప్రయోజనాల రీత్యా అంగీకరిస్తారని పేర్కొన్నారు. ‘పౌర హక్కుల పరిరక్షణ, మానవ హక్కులపై గౌరవం, ప్రజలకు రాజ్యాంగపరమైన స్వేచ్ఛ ప్రసాదించే విషయంలో ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. భిన్నత్వమే భారతీయుల బలమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతున్న అమృత మహోత్సవాల సమయంలో.. కాలం చెల్లిన వలసవాద చట్టాలు, పద్ధతులకు స్వస్తి పలకాలని ప్రధాని భావిస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే 2014-15 నుంచి 1,500 వరకు కాలం చెల్లిన చట్టాలను కేంద్రం రద్దుచేసింది. ప్రజలకు తీవ్రమైన అడ్డంకులు కలిగిస్తున్న అర్థం పర్థం లేని నిబంధనలను తొలగించింది.ఇది నిరంతర ప్రక్రియ. రాజద్రోహంపై వ్యక్తమైన వివిధ అభిప్రాయాలు కేంద్రం దృష్టికి వచ్చాయి. పౌర స్వేచ్ఛ, మానవ హక్కులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అందువల్ల దేశ సార్వభౌమత్వం, సమగ్రతను దృష్టిలో ఉంటుకుని ఐపీసీ 124ఏ సెక్షన్‌ను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. అది జరిపేంతవరకూ ఈ సెక్షన్ ఔచిత్యంపై పరిశీలించవద్దు’ అని మెహతా అభ్యర్థించారు. రాజద్రోహం కింద నమోదైన పెండింగ్ కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను వేగిరపరచవచ్చని సూచించారు. అన్ని కేసుల తీవ్రతా ప్రభుత్వానికి తెలియదని.. కొన్ని ఉగ్రవాద కోణంలో, ఇంకొన్ని మనీలాండరింగ్ కోణంలో ఉండిఉండొచ్చని పేర్కొన్నారు. పైగా పెండింగ్ కేసులు న్యాయస్థానాల ముందే ఉన్నాయని.. వాటిని విశ్వసించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త ఎఫ్ఐఆర్లు నమోదుచేసే ముందు వాటిని స్ర్కుటినీ చేసేందుకు ఎస్పీ స్థాయి అధికారికి పంపాలని, ఆయన తీసుకునే నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని కోర్టుకు ప్రతిపాదించారు. దీనిని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, సీయూ సింగ్ వ్యతిరేకించారు. అనంతరం.. చీఫ్ జస్టిస్, ఇద్దరు న్యాయమూర్తులు చర్చించుకుని రాజద్రోహం సెక్షన్‌పై స్టే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఐపీసీ 124ఏ సెక్షన్ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదన్న కోర్టు అభిప్రాయంతో ప్రభుత్వం కూడా ప్రాథమికంగా అంగీకరించిందని జస్టిస్ రమణ గుర్తుచేశారు. ఓవైపు ప్రభుత్వ విధి నిర్వహణ, మరో వైపు పౌరహక్కులను గమనంలోకి తీసుకున్నామని.. రెండింటి మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హనుమాన్ చాలీసా పఠించినా రాజద్రోహ నేరం మోపారని స్వయంగా అటార్నీ జనరలే చెప్పారని గుర్తుచేశారు. అందుచేత చట్ట పునఃపరిశీలన పూర్తయ్యేదాకా.. ప్రభుత్వాలు దాని అమలును కొనసాగించకపోవడం సముచితమంటూ.. ఆ సెక్షన్ అమలుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేశా రు. అయితే సెక్షన్ పునఃపరిశీలనను ప్రభుత్వానికే వదిలేయడానికి ధర్మాసనం అంగీకరించింది. 124ఏపై న్యాయనిపుణులు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజలు వ్యక్తంచేసిన భిన్నాభిప్రాయాలకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ ఈ నెల 9న దాఖలుచేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.
ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలివీ.. 124ఏ సెక్షన్‌ను కేంద్రం పునఃపరిశీలించేదాకా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్లను నమోదు చేయవని.. దర్యాప్తును, ఇతర చర్యలను కొనసాగించబోవని ఆశిస్తున్నాం. ఈ సెక్షన్ కింద కొత్త కేసు నమోదు చేసినట్లయితే.. బాధితులు సముచిత ఉపశమనం కోసం సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు ఇప్పుడిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను, కేంద్రప్రభుత్వ స్పష్టమైన వైఖరిని పరిగణనలోకి తీసుకుని ఆయా కోర్టులు వారికి ఉపశమనం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. 124ఏ సెక్షన్ కింద నమోదు చేసిన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణలు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలి. అయితే ఇతర సెక్షన్లకు సంబంధించి కోర్టులు న్యాయ నిర్ణయం చేయొచ్చు. ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగు మార్గదర్శకాలు ఇవ్వొచ్చు. ధర్మాసనం తదుపరి ఆదేశాలిచ్చేవరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి.